ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు వ్యవహారంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా ఇది పెద్ద దుమారమే రేపుతుంది. మండలి రద్దు నిర్ణయంపై తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికే అసహనం వ్యక్త౦ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి నిర్ణయాలు తప్పు అని ఏపీని చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
తాజాగా టిఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ శాసనమండలి రద్దు అర్థరహితమని, కౌన్సిల్ పెద్దల సభగా కొనసాగాలాని తాను కోరుకుంటున్నట్లు తన మనసులో మాట బయటపెట్టారు. అదే విధంగా ఎన్టీఆర్ హయాంలో శాసన మండలిని రద్దుచేస్తే తాను స్వయంగా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేశా అని ఆయన వ్యాఖ్యానించారు.
అదే విధంగా మండలి వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టమనడం నాన్సెన్స్ అన్న ఆయన, ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో అదేమీ పెద్ద ఖర్చు కాదని, ప్రజాస్వామ్యంలో రెండో అభిప్రాయం తప్పనిసరి అని స్పష్టం చేసారు. ఎవరైనా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే దాన్ని సరిచేసేందుకు పెద్దలు సరిచేస్తారని, శాసన సభ నిర్వహణా వ్యయంలో కేవలం 3 శాతం వ్యవయంతోనే మండలి నడపవచ్చని, అందుకే అసలు ఖర్చు విషయమే తలెత్తదని కేకే వ్యాఖ్యానించారు.