- చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి
- దుష్ర్పచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
- శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం విడుదలకు నిర్ణయం
అత్యంత పురాతన ఆలయాల్లో ఒకటిగా వెలుగొందుతోంది తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం.తిరుమల శ్రీవారి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. పూర్వం రాజులు,చక్రవర్తులు ఆలయ నిర్మాణానికి తోచినంతగా సాయం చేశారు. కొందరైతే స్వయంగా ఆలయం వద్ద నిర్మాణాలు చేపట్టారు. శ్రీకృష్ణ దేవరాయలు తిరుమల ఆలయానికి విలువ కట్టలేని కానుకలిచ్చారని చరిత్ర చెబుతోంది. రాయల వారే కాదు కోరిన వరాలిచ్చే స్వామి వారికి అన్ని వర్గాల వారు యుగయుగాలుగా కానుకలు ఇస్తూనే ఉన్నారు. ఆ కానుకలను చక్కగా భద్రపరుస్తోంది టీటీడీ. నగదు,నగల రూపంలో అనేకమంది స్వామివారికి కానుకలు సమర్పిస్తుంటారు. అయితే ఈ కానుకల విషయంలో ఎప్పుడూ వివాదాలు చెరేగుతూనే ఉన్నాయి. స్వామివారి కానుకలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా శ్రీవాణి ట్రస్ట్‌కి ఇచ్చే కానుకలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రస్ట్‌కి వచ్చే కానుకలను సొంత అవసరాలకు వాడేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దేవుడి నిధులను మింగినవారు ఎవరూ బాగు పడలేదని జీవిత చరమాంకంలో ఖచ్చితంగా అనుభవిస్తారని ఆయన పేర్కొన్నారు. శ్రీవాణి నిధులను ప్రభుత్వం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. అంత ధైర్యం ఎవరిచ్చారని,అసలు శ్రీవాణి ట్రస్ట్ నిధులపై లెక్కలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు మాటలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
చంద్రబాబు విమర్శలపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించగా పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి శ్రీవాణి ట్రస్ట్ నిధుల ఖర్చుపై క్లారిటీ ఇచ్చారు. ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంటు ఉందని చెప్పిన సుబ్బారెడ్డి….టీటీడీ నుండి ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టే ప్రసక్తే లేదన్నారు. శ్రీవాణితోపాటు ఇతర ఏ ట్రస్టుల్లో అయినా అవినీతి జరుగుతోందనే అనుమానం ఉంటే ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దీనిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని స్పష్టం చేశారు.