యనమల ఫ్యామిలీలో ‘తుని’ చిచ్చు..నెల్లిమర్లలో టీడీపీలో రచ్చ.!

-

తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికరంలోకి రావాలని చెప్పి చంద్రబాబు ఇప్పటినుంచే అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. దాదాపు అన్నీ స్థానాల్లో నేతలని పెట్టిన బాబు..కొన్ని స్థానాల్లో ఇంకా ఇంచార్జ్ లని పెట్టలేదు. కొన్ని స్థానాల్లో విభేదాలు ఉండటం వల్ల వాటిని పెండింగ్ పెట్టారు.

అయితే తాజాగా కొన్ని స్థానాలకు ఇంచార్జ్ లని పెట్టారు. ఇదే క్రమంలో టి‌డి‌పి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కంచుకోటగా ఉన్న తునిలో ఇంచార్జ్‌ని నియమించారు. తుని ఇంచార్జ్‌గా యనమల కుమార్తె దివ్యని నియమించారు. దీంతో యనమల సోదరుడు కృష్ణుడు అసంతృప్తిగా ఉన్నారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు యనమల తుని బరిలో గెలిచారు. 2009లో ఓడిపోయారు. 2014లో పోటీ చేయలేదు. దీంతో తుని సీటుని తన సోదరుడు కృష్ణుడుకు ఇప్పించారు. కానీ కృష్ణుడు..2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు.

దీంతో ఆ సీటులో అభ్యర్ధిని మార్చాలని డిమాండ్ వచ్చింది. అసలు యనమల ఫ్యామిలీకి సీటు ఇవ్వవద్దని కొందరు కార్యకర్తలు డిమాండ్ చేశారు. కానీ యనమలని చంద్రబాబు సైడ్ చేయలేరు. అదే సమయంలో యనమల చక్రం తిప్పి తన సోదరుడుని తప్పించి, తన కుమార్తెకు తుని సీటు దక్కేలా స్కెచ్ వేసి సక్సెస్ అయ్యారు.

అటు నెల్లిమర్ల సీటుకు బంగార్రాజుని ఇంచార్జ్ గా పెట్టారు. సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి మనవడు ఆ సీటు ఆశించారు..కానీ బంగార్రాజుకు దక్కింది. దీంతో పతివాడ అసంతృప్తిగా ఉన్నారు. అసలు ఎవరిని సంప్రదించకుండా ఇంచార్జ్‌ని ఎలా మారుస్తారని ఫైర్ అవుతున్నారు. దీంతో పతివాడ టి‌డి‌పికి దూరం జరుగుతారా? అనే చర్చ నడుస్తోంది. మొత్తానికి కొత్త ఇంచార్జ్‌ల నియామకం టి‌డి‌పిలో చిచ్చు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version