తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులు, తీసుకుంటున్న రుణాల వల్ల రాష్ట్రంలో పుట్టే ప్రతి పిల్లాడిపై రూ.1.25 లక్షల అప్పు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. దేశం మొత్తం తిరిగే ముందు తమ రాష్ట్రంలో జరుగుతున్న దానిపై సమాధానం చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. మిగులు నిధులు ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకే దక్కుతుందన్నారు.
ప్రాజెక్టుల వ్యయం ఇష్టమొచ్చినట్టుగా పెంచుతున్నారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.20లక్షల కోట్లకు పెంచారని తెలిపారు. ‘మన ఊరు-మన బడి’ కేంద్ర పథకం అయితే దాన్ని రాష్ట్ర స్కీమ్‌గా క్లెయిమ్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతాయనే ఆయుష్మాన్ భారత్‌లో చేరడం లేదని విమర్శించారు. తెలంగాణలో ప్రతి 100 మందిలో 91 మంది రైతులు అప్పుల పాలయ్యారని రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని గణాంకాలు ముందుంచారు. లిక్కర్ స్కామ్‌లో ఎవరిపై ఆరోపణలు వచ్చాయో వాళ్లే సమాధానం చెప్పాలని’నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.