బీజేపీలో సినీ ప్రముఖుల హవా పెరుగుతుంది..ఇప్పటికే తెలంగాణ బీజేపీలో పలువురు సినీ ప్రముఖులు జాయిన్ అయ్యారు. ఇంకా పలువురు జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుండటంతో..బీజేపీలో చేరికలు పెరిగాయి. అయితే సినిమా రంగానికి చెందిన వారు..గతంలో టీడీపీకి ఎక్కువ మద్ధతుగా ఉండేవారు. కానీ తెలంగాణలో టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. దీంతో మెజారిటీ టీఆర్ఎస్‌కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు.
ఇక ఇప్పుడు బీజేపీ బలం పెరగడంతో బీజేపీ వైపుకు వస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీలో ఉన్న సినీ ప్రముఖులు కొందరు సీట్లు కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయశాంతి, బాబూమోహన్ లాంటి వారు యాక్టివ్ గా రాజకీయం చేస్తున్నారు. అలాగే జీవిత, రాజశేఖర్, కవిత, దివ్యవాణి లాంటి వారు బీజేపీ వైపుకు వస్తున్నారు. ఇక జీవితారాజశేఖర్ ఎప్పటినుంచో బీజేపీలో ఉంటున్నారు. మధ్య మధ్యలో పార్టీలు మారి వచ్చారు..కానీ చివరికి బీజేపీలో పనిచేస్తున్నారు.
ఇటీవల ఆమె బీజేపీలో బాగా యాక్టివ్ అయ్యారు. బలమైన వాయిస్ వినిపించే జీవితని ఎన్నికల ప్రచారంలో దించాలని బీజేపీ అధిష్టానం చూస్తుంది. ఇదే క్రమంలో జీవిత సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బండి సంజయ్‌కు తన ప్రతిపాదన ముందు పెట్టినట్లు తెలిసింది. దీనిపై ఆలోచిస్తామని బండి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక సీటు అడుగుతున్నట్లు తెలిసింది.
కానీ తాజాగా ఆమెకు జహీరాబాద్ ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. గతంతో పోలిస్తే జహీరాబాద్‌లో బీజేపీ బలం పెరిగినట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి కేవలం లక్షా 38 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈ సారి జీవితాని బీజేపీ తరుపున బరిలో దిగితే గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.
ఇదిలా ఉంటే మెదక్ ఎంపీ సీటులో విజయశాంతి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం వస్తుంది. కాకపోతే అసెంబ్లీ ఎన్నికలు ముందే జరుగుతాయి కాబట్టి..వీరిని అసెంబ్లీ బరిలో నిలబెడతారా? లేక పార్లమెంట్ బరిలో నిలబెడతారో చూడాలి.