పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. నిన్న టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా లోక్ సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా, పార్టీ విప్ గా విజయవాడ ఎంపీ కేశినేని నానిని నియమించారు. రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా సీఎం రమేశ్ ను నియమించాలని చంద్రబాబు
నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చిన పదవిని సున్నితంగా తిరస్కరించారు. చంద్రబాబు… నానికి పార్లమెంటరీ విప్ పదవిని ఇచ్చారు. కానీ.. నాని మాత్రం తనకు ఆ పదవి అక్కర్లేదని ఫేస్ బుక్ వేదికగా తిరస్కరించారు. దీంతో ఏపీలో ఈ విషయం చర్చనీయాంశమైంది.
అసలు ఏం జరిగిందంటే… పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. నిన్న టీడీపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా లోక్ సభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా, పార్టీ విప్ గా విజయవాడ ఎంపీ కేశినేని నానిని నియమించారు. రాజ్యసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా సీఎం రమేశ్ ను నియమించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ పదవిపై వెంటనే కేశినేని నాని ఫేస్ బుక్ వేదికగా స్పందించారు.
లోక్ సభ లో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా, పార్టీ విప్ గా నన్ను నియమించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు. కానీ.. నేను ఆ పదవికి అర్హుడిని కాను. అంత పెద్ద పదవి బాధ్యతలను నేను మోయలేను. నాకన్నా సమర్థులైన వాళ్లను ఆ పదవిలో నియమించండి. నన్ను విజయవాడ ప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారు. అందుకే నా నియోజకవర్గంలో ఉండి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. నాకు వేరే పదవులేమీ వద్దు. నామీద నమ్మకముంచిన చంద్రబాబుకు నేను మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆ పదవిని తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నా.. అంటూ కేశినేని నాని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
నాని బీజేపీలో చేరనున్నారా?
అయితే.. కేశినేని నాని టీడీపీని వీడుతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. వాటిని నిజం చేసేలా ఆయన ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. అందుకే లోక్ సభలో పార్టీ విప్ పదవిని నాని తిరస్కరించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి పాలవడంతో మిగితా టీడీపీ నాయకులు కూడా బీజేపీలో చేరడానికి క్యూ కట్టారని తెలుస్తోంది. చాలామంది ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో టచ్ లో ఉన్నారట.