సంఖ్యాబలం పరంగా చూస్తే విశాఖ ఎమ్మెల్సీ స్థానం వైసీపీదే అంటున్నాయి రాజకీయ సర్వేలు. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో ఊహించలేము కాబట్టి వైసీపీ, టీడీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశముందని మరికొందరు అంటున్నారు. టీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే వైసీపీ విజయం సాధించగలిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంపూర్ణ విజయం సాధించారు. పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి పార్టీలు నిలబెట్టే అభ్యర్థి గెలిచే అవకాశాలు లేకపోయినప్పటికీ వైసీపీకి గట్టి సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడు స్థానిక సంస్థల్లో సత్తా చాటుతోంది. వరుస విజయాలను నమోదు చేసి కూటమి ప్రభుత్వానికి గట్టి సవాల్ విసరుతోంది. గత నెలలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అలాగే కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో సైతం వైసీపీ నాయకులు సత్తా చాటారు. స్టాండింగ్ కమిటీలో ఉన్న ఐదు స్థానాలకు గానూ ఐదింటినీ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.
అక్కడ మంత్రి టీజీ భరత్ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఇప్పుడు విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలోనూ అదే రిపీట్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. అక్కడ వైసీపీ తరపున మాజీమంత్రి, సీనియర్ రాజకీయవేత్త బొత్స సత్యనారాయణ బరిలోకి దిగారు. బొత్సను ఢీకొట్టేందుకు బలమైన అభ్యర్ధి కోసం కూటమి పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. పీలా గోవింద్, గండి బాబ్జీ.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో గెలుపుపై వైసీపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు.
విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల్లో మొత్తం ఓట్లు 841 ఉండగా.. అందులో వైసీపీ బలం 615 మంది. టీడీపీ, జనసేన, బీజెపీ సభ్యులకు కేవలం 215 ఓట్లు ఉన్నాయి. ఈ ఎన్నికలో కూటమి అభ్యర్ధి గెలవాలంటే భారీ సంఖ్యలో వైసీపీ నుంచి చేరికలు ఉండాలి. లేదంటే కూటమికి విజయం చాలా కష్టమవుతుంది. ఇంత తక్కువ సమయంలో వైసీపీ ఓటర్లను కూటమి వైపు తిప్పుకునేంత అవకాశం లేదు.
దీనినిబట్టి చూస్తే విశాఖలోనూ టీడీపీకి ఓటమి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో అద్భుతాలు జరగాలని కూటమి పార్టీలు కోరుకుంటున్నాయి. విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో జీవీఎంసీ కార్పొరేటర్లతో పాటు యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఎలాగోలా మాయ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు గెలిచాయి కానీ ఇప్పుడు మాత్రం వైసీపీతో అంత ఈజీ కాదనే సెటైర్లు పేలుతున్నాయి.