కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేతలు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వచ్చే పదేళ్లు కూడా రాష్ట్రంలో తమ పార్టీనే అధికారంలో ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలు కేసీఆర్ పాలనతో విసుగు చెందాకే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు.
రైతులను రెచ్చగొట్టడం ఇకనైనా మానుకోవాలని లేనియెడల మీకే నష్టమని హెచ్చరించారు. ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటెల్లో భాగంగా ఒక్కో హామీని నెరవేరుస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగానే మూడు విడతలో రుణమాఫీని పూర్తి చేశామన్నారు.
కొన్ని బ్యాంకుల్లో సాంకేతిక కారణాల చేత కొందరు రైతులకు రుణమాఫీ కాలేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారికి కూడా త్వరలోనే నగదు అకౌంట్లో జమ అవుతుందని చెప్పారు. అర్హులైన రైతులందరికీ తప్పకుండా రుణమాఫీ చేస్తామన్నారు.