కూటమి ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా నెల పూర్తయింది.. ఈలోపే ప్రభుత్వ నిర్ణయాలపై నెల్లూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాటలతూటాలు పేలుస్తున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.. సైలెంట్ గా ఉంటే ప్రత్యర్థులు ఎక్కడ ఇబ్బంది పెడతారు అనుకున్నారో ఏమో.. నిరంతరం వార్తల్లో నిలుస్తూ.. అధికార పార్టీ నేతలకు ముచ్చమటలు పట్టిస్తున్నారు.. ఆయన మాటలు వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా సైకిల్ పార్టీ హస్తగతం చేసుకుంది.. జిల్లా ప్రజలు ఇచ్చిన షాక్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరూ తలో దిక్కుకూ వెళ్ళిపోయారు.. ఈ నెల రోజుల్లో ఒకటి రెండు సార్లు తప్ప.. మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలకు అందుబాటులో ఉన్న సందర్భాలే లేవు.. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం ఫుల్ టైం రాజకీయాలు నడుపుతున్నారట.. సర్వేపల్లి నుంచి రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. ఇక్కడి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయకేతనం ఎగరవేశారు. అధికారంలో ఉన్న సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి తన ప్రత్యర్థిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై అనేక ఆరోపణలు చేశారు. సోమిరెడ్డికి విదేశాలలో అక్రమ ఆస్తులు ఉన్నాయంటూ కాకాని ఆరోపించడంతో.. సోమిరెడ్డి పరువు నష్టం కేసు కూడా పెట్టారు. ఇలాంటి కేసులు ఎన్నో కాకాని మీద ఉన్నాయి.. తాము అధికారంలోకొస్తే కాకాన్ని వదిలే ప్రసక్తే లేదని సైకిల్ పార్టీ నేతలు ఎన్నో ప్రకటనలు చేసిన విషయాన్ని నియోజకవర్గ ప్రజలు గుర్తుతెచ్చుకుంటున్నారట.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.. అయితే సైలెంట్ అవ్వాల్సిన కాకాని గోవర్ధన్ రెడ్డి.. మీడియా సమావేశాలు పెట్టి మరి తెలుగుదేశం పార్టీ నేతలపై విమర్శలు సంధిస్తున్నారు.. ఆయన ప్రెస్మీట్ల వెనుక ఆంతర్యం ఏంటి అనే చర్చ నెల్లూరులో జోరుగా జరుగుతోంది.. సైలెంట్ గా ఉంటే తన రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై అధిపత్యం చాలా ఇస్తారని… మీడియాలో నిత్యం కనపడితే తన జోలికి రారనే ఆలోచనలో కాకాని ఉన్నారట.. దానికి తోడు క్యాడర్లో కూడా మనోధైర్యం నింపేందుకే నిత్యం కాకాని విమర్శలు చేస్తున్నారని రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాకా అందరి పైన ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు.. అలా చెయ్యకపోతే తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి కాకాని మనోగతమట.. అందులో భాగంగానే జిల్లాలోని వైసీపీ నాయకులెవ్వరూ మాట్లాడకపోయినా.. కాకాని మాత్రం నిత్యం మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వంపై మాటల తూటలు పేలుస్తున్నారట.. ఈ వ్యవహారంపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి..