బద్వేలు బరిలో బీజేపీ…నోటాపై గెలుస్తుందా?

-

అందరిదీ ఒక దారి అంటే…..మాది ఒక దారి అన్నట్లుగా ఏపీలో బీజేపీ ముందుకెళుతుంది. అసలు ఏపీలో బి‌జే‌పి పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ పార్టీకి కనీసం ఒక్కశాతం ఓట్లు కూడా పడని పరిస్తితి. అలాంటిది బద్వేలు ఉపఎన్నిక బరిలో దిగి ఏదో సాధించేస్తామనే ఫీలింగ్‌లో బి‌జే‌పి నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణించడంతో… బద్వేలు ఉపఎన్నిక జరుగుతుంది. తాజాగా ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అయితే ఈ ఉపఎన్నికలో మొదట టి‌డి‌పి పోటీ చేయాలని అనుకుని, అభ్యర్ధిగా ఓబుళాపురం రాజశేఖర్‌ని ప్రకటించారు. కానీ సడన్‌గా జనసేన పోటీ చేయడం లేదని, ఆనవాయితీ ప్రకారం చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచే అభ్యర్ధి బరిలో దిగుతుండటంతో తాము పోటీ నుంచి తప్పుకుంటున్నామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

ఆ వెంటనే చంద్రబాబు సైతం…బద్వేలు ఉపఎన్నిక బరిలో తాము పోటీ చేయడం లేదని ప్రకటించేశారు. కానీ జనసేన మిత్రపక్షంగా ఉన్న బి‌జే‌పి మాత్రం…తాము పోటీ చేస్తామని ప్రకటించేసింది. కేంద్ర నాయకత్వంతో చర్చించి అభ్యర్ధిని ప్రకటిస్తామని సోము వీర్రాజు చెప్పారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టి‌డి‌పి తప్పుకుంది…జనసేన కూడా పోటీ చేయడం లేదు.మరి బి‌జే‌పి బద్వేలు ఉపఎన్నిక ఏకగ్రీవం అవ్వనివ్వకుండా పోటీ చేసి ఏం సాధిస్తుందో అర్ధం కాకుండా ఉంది. ఎన్నిక వల్ల ప్రభుత్వ సమయం, డబ్బులు వేస్ట్.

అలా అని బి‌జే‌పి ఏమన్నా గెలిచేస్తుందా? అంటే అది లేదు. అసలు బద్వేలులో బి‌జే‌పి నోటాని దాటితే చాలు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ 44 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఇక 50 వేల ఓట్లు తెచ్చుకుని టి‌డి‌పి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. అలాగే దాదాపు 3 వేల ఓట్లు తెచ్చుకుని ఒక ఇండిపెండెంట్ అభ్యర్ధి థర్డ్ ప్లేస్‌లో నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు 2337 ఓట్లు రాగా, నోటాకు 2 వేల ఓట్లు వచ్చాయి. ఇక్కడ బి‌జే‌పికి పడిన ఓట్లు కేవలం 735 ఓట్లు. అంటే బి‌జే‌పి పరిస్తితి ఏంటో అర్ధమవుతుంది. మరి ఇప్పుడు బరిలో దిగి నోటాపై గెలవాలని బి‌జే‌పి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి బద్వేలు బరిలో బి‌జే‌పి ఏం సాధిస్తుందో?

Read more RELATED
Recommended to you

Exit mobile version