అమరావతి: 2019 ఎన్నికలు సుస్థిర, అరాచక కూటముల మధ్య పోటీ అని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఏపీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సుస్థిరత పేరుతో ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ కాలరాసిందని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందని, రాజ్యాంగ విలువలు కాపాడలేని సుస్థిర ప్రభుత్వాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలను అణిచివేసేది సుస్థిర ప్రభుత్వం కాదని యనమల అన్నారు. ప్రతిపక్షాలను బెదిరించి చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని, బడుగు బలహీన వర్గాలపై దౌర్జన్యాలు పెరిగాయని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైసీపీ ఎంపీల రాజీ డ్రామాకు క్లైమాక్స్.. ఈసీ ప్రకటన అని అన్నారు. బీజేపీ, వైసీపీ లాలూచీకి ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలని నిలదీశారు. లాలూచి పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని యనమల అన్నారు.