వైసీపీకి త్వరలో భారీ షాక్ తప్పదా… టీడీపీ తో టచ్ లో ఎమ్మెల్సీలు

-

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీకి త్వరలో మరో భారీ షాక్ తగలనుందనే వార్తలు వస్తున్నాయి.మండలిలో ప్రతిపక్ష సభ్యులుగా కొనసాగేకన్నా అధికార పార్టీలో చేరడమే ఉత్తమమని ఎమ్మెల్సీలు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. శాసన మండలిలో మెజార్టీతో ప్రభుత్వానికి చెక్ పెట్టాలని భావించిన వైసీపీ అధిష్టానానికి కొందరు ఎమ్మెల్సీలు చెక్ ఝలక్ ఇవ్వనున్నారు.త్వరలోనే వారు టీడీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఎక్కువ మంది ఎమ్మెల్సీలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ప్రస్తుతం శాసనమండలిలో 58 మంది సభ్యులకు గాను వైసీపీకి 30 మంది, టీడీపీకి 9, జనసేనకు 1, పీడీఎఫ్‌ కు 2, ఇండిపెండెంట్లు 4, నామినేట్ అయిన సభ్యులు 8 మంది ఉన్నారు. నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ మాదిరిగా ఏపీలో టీడీపీ సైతం ఆకర్ష్ వల వేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.అసెంబ్లీలో కూటమి సీట్ల సంఖ్య 164.కేవలం 11 స్థానాలతో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది వైసీపీ.ఇక్కడ మెజారిటీ లేకపోయినా మండలిలో మెజార్టీతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొచ్చని వైసీపీ భావించింది.ఆ దిశగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలతో సమావేశమై పలు సూచనలు చేశారు.కానీ ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్సీలు ఝలక్‌ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గత నెల రోజులుగా జరిగిన పరిణామాలు పరిశీలిస్తే ఎక్కువ మంది ఎమ్మెల్సీలు వైసీపీని వీడేందుకే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాయలసీమకు చెందిన ఎమ్మెల్సీ, మండలి వైస్‌ చైర్‌పర్సన్‌ జకియా ఖానమ్‌ టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.ఈ మేరకు ఆమె మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ను కలిసి మాట్లాడారని ఓ వర్గం చెబుతోంది.టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన పోతుల సునీత సైతం తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ ఇద్దరే కాకుండా రాయలసీమకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.మరికొంతమంది టీడీపీలో కలుస్తామంటూ మంత్రుల అపాయింట్‌మెంట్‌ అడుగుతున్నారట. అయితే ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోందని సమాచారం. గత ఐదేళ్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోకూడదని భావిస్తున్నారు. వారి విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మండలిలో మెజారిటీ లేకపోవడంతో ఆ వ్యవస్థను రద్దు చెసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు మొన్నామధ్య వార్తలు వచ్చాయి. ఆ ప్రాసెస్ జరగటానికి కొంత టైమ్ పడుతుంది కాబట్టి ఈలోపు వైసీపీ ఎమ్మెల్సీలను చంద్రబాబు టీడీపీలోకి లాగేసుకుంటారనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ పరిణామం ఏపీలో ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news