తన అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌నే చంద్ర‌బాబు సిబిఐపై యుద్ధం

-

విజ‌య‌న‌గ‌రం (కురుపాం) : ఆంధ్రప్రదేశ్‌ ప్రజల బాధలు, వారి సమస్యలు పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై పోరాటం చేస్తానంటూ భేటీలు పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర సమస్యలను వదిలేసి పక్క రాష్ట్ర నేతలతో భేటీలవుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుంటే పట్టించుకోని చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన అవినీతి బయటపడకుండా కాపాడుకునేందుకే సీబీఐ ప్రవేశాన్ని రద్దు చేస్తూ జీవో తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబుపై విచారణ చేయమని హైకోర్టు ఆర్డర్‌ ఇస్తే.. ఏపీకి హైకోర్టు కూడా అవసరం లేదని జీవో ఇచ్చినా ఇచ్చేస్తారని ఎద్దేవా చేశారు. 302 రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా కురుపాంలో నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన చంద్రబాబు పాలన తీరును చీల్చి చెండాడారు.

తోటపల్లి ప్రాజెక్టు గురించి పట్టించుకున్నారా?
‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొన్న చంద్రబాబు కురుపాం ఎమ్మెల్యే పుష్పవాణినిని ప్రలోభపెట్టారు. కానీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా విలువలతో కూడిన రాజకీయాలు చేశారు పుష్పవాణి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయంలోనే కురుపాం అభివృద్ధి చెందింది. ఎందరికో ఇళ్లను నిర్మించి ఇచ్చారు. కానీ చంద్రబాబు పాలనలో ఊరికి నాలుగైదు ఇళ్లను కూడా ఇవ్వలేదు. వైఎస్సార్‌ సీఎం అయ్యాక తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెట్టించారు. ఆయన హయంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక తోటపల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేద’ని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version