దేశంలోనే తొలిసారి… జ‌గ‌న్ స‌ర్కార్‌ హిస్టారిక‌ల్ డెసిష‌న్‌

-

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని ఓ చారిత్రక నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం తీసుకోవడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో రూ. 100 కోట్లు దాటిన ప్రాజెక్టులన్నీ న్యాయసమీక్ష తర్వాతే టెండ‌ర్ల ద‌శ‌కు వెళ్లాలని ప్ర‌భుత్వం డిసైడ్ చేసింది. దీనికోసం హైకోర్టు జడ్జి జస్టిస్ శివశంకరరావు నియ‌మితులు అయిన‌ట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శివ‌శంక‌ర్ రావు వ‌చ్చే మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. వంద కోట్లకు పైగా పనుల టెండర్లను న్యాయసమీక్ష చేస్తారు. ఈ సమీక్ష అనంతరమే ప్రాజెక్టుల కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఓకే చేస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ టెండర్లలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. టిడిపి హయాంలో అక్ర‌మంగా ప్రాజెక్టులు కట్టారని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు.


ఇక వైసీపీ అధికారంలోకి వస్తే జ్యుడీషియల్ క‌మిటీ ఏర్పాటు చేసి టెండర్లను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆయన అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చినట్టుగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే న్యాయసమీక్ష అమలులోకి తెస్తే సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇక‌పై ఏ టెండ‌ర్ అయినా రూ.100 కోట్లు దాటితే జ‌డ్జి టెండ‌ర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు, ప్ర‌జ‌లు, నిపుణుల ప‌రిశీల‌నకు వారం రోజుల పాటు ప‌బ్లిక్ డొమైన్‌లో ఉంచుతారు.

ఇక టెండ‌ర్ల విష‌యంలో జ‌డ్జి సిఫార్సులు ఖ‌చ్చితంగా పాటించాలి. 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదనను ఖాయం చేస్తారు. ఆ తర్వాతే బిడ్డింగ్‌ పారదర్శకంగా కాంట్రాక్టర్లకు దక్కుతుంది. ఈ విధానం కనక విజయవంతమైతే దేశంలో చాలా రాష్ట్రాలకు జగన్ సర్కార్ ఆదర్శం కానుంది. ఏది ఏమైనా తన మార్కు పాలనతో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ మరోసారి ఆ పంథాను చాటుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version