నలుదిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడివై రేపటి లక్ష్యం కోసం అడుగై- అన్నాడో సినీకవి. ఓటమి పలుకరించినా వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలన్నది ఆ మాటల అంతరార్ధం. నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్ గా పెట్టుకుని గెలుపుకోసం ప్రణాళికలు రచిస్తున్న జగన్ కి ఈ మాటలు చక్కగా సరిపోతాయి. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఒంటరిగా మొదలై ప్రభంజనం సృష్టించిన జగన్ మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలైనా పడి లేచిన కెరటంలా అడుగులు వేస్తున్నారు.
వైయస్ ఫ్యామిలీ నుంచి మొదటిసారి రాజశేఖర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యారు. ఆయన ఉన్నన్ని రోజులు ఎన్నో అభివృద్ధి పనులు, పేద ప్రజలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఇప్పటికి ఆయన ఫోటోను ఇండ్లలో దేవుడితో సమానంగా కొలుస్తారు. ఆ విధంగా తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాల్లో రాటుదేలిపోయారు. విపత్కర పరిస్థితులను కూడా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నారు. ఎప్పుడైనా సరే ఓటమి అనేది గుణపాఠం నేర్పిస్తుంది.మొన్నటి ఓటమితో పాఠాలు నేర్చిన జగన్ 2029 టార్గెట్ గా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
2019లో జగన్మోహన్ రెడ్డి 151సీట్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో ఉత్తమమైన పథకాలు తీసుకొచ్చారు. విద్యా వ్యవస్థ బాగుపడితే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని విద్యకి ఎక్కువగా నిధులు కేటాయించి ప్రభుత్వ స్కూళ్లను, ప్రైవేటుకు ధీటుగా తయారు చేశాడు. అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ఇంటికే పథకాలు అందేలా చేశారు. ఇలా ఎన్ని చేసినా జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రజల్లో ప్రచారం లేకపోవడమే.
కింది స్థాయిలో లీడర్లు ప్రజలతో ఏ విధంగా ఉంటున్నారు, వారు ఏ పనులు చేస్తున్నారు అనేది కూడా తప్పక తెలుసుకోవాలి. అలాంటప్పుడే రాజకీయాల్లో అన్ని విధాల రాణించగలం.
మొన్నటి ఓటమి నుంచి జగన్ చాలా నేర్చుకున్నారు.ఎవరిని అక్కున చేర్చుకోవాలి, ఎవరిని దూరం పెట్టాలి అనేది తెలుసుకున్న జగన్ కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు.
2029ని టార్గెట్ చేసుకొని ముందుకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు.ప్రస్తుతం జనసేనపార్టీ కూటమితో కలిసి అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు తప్పక జనసేన అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే బలం సంపాదించుకోవడం కోసం ట్రై చేస్తోంది. ఒకవేళ ఈ ఐదేళ్లలో వారి మధ్య పొత్తు విషయంలో చిచ్చు పుట్టిందంటే పవన్ ఒంటరిగా పోటీ చేస్తాడు. అదే జరిగితే మాత్రం తప్పక జగన్మోహన్ రెడ్డికి బంగారు బాటలు పడ్డట్టే. 2029వరకు టీడీపీ కాకుండా జనసేన మరియు వైసిపి మధ్య పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పార్టీ ఐదేళ్లు పాలిస్తే తప్పక వ్యతిరేకత వస్తుంది. ఈ రెండు పాయింట్లు ఉపయోగించుకొని జగన్ నిత్యం ప్రజలతో మమేకమై ఉంటే 2029 లో తప్పక అధికారంలోకి రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఆ దిశగా అడుగులు వేస్తున్న జగన్ మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ శ్రేణులు ఆశిస్తున్నారు.