వైఎస్సాఆర్సీపీ లోక్ సభ అభ్యర్థులు వీళ్లేనా? 21 స్థానాల అభ్యర్థులపై స్పష్టత..!

-

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. దేశమంతా ఎన్నికలు జరగనున్నప్పటికీ.. ఏపీలో రాజకీయాలపై ప్రస్తుతం దేశమంతా చర్చిస్తోంది. ఏపీ ఎన్నికలపైనే ఆసక్తి. అది చంద్రబాబు వల్ల కావచ్చు.. వైఎస్ జగన్ వల్ల కావచ్చు. వాళ్లిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వల్ల కావచ్చు.. ఏపీలో జరుగుతున్న రాజకీయ కుట్రల వల్ల కావచ్చు. ఏది ఏమైనా ఏపీలో చీమ చిటుక్కుమన్నా దేశమంతా ఏపీవైపే చూస్తోంది. తాజాగా వైఎస్సాఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల కోసం లోక్ సభ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నారు. అయితే.. ఇప్పటికే 25 మందిలో కొంతమందిని ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ నుంచి చాలామంది నేతలు వైసీపీలో చేరారు. వైసీపీలోకి కొత్త నాయకులు రావడంతో పార్టీలో ఇప్పుడు మాంచి ఊపు ఉన్నది. ఈనేపథ్యంలో అందరినీ దృష్టిలో పెట్టుకొని వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు జగన్.

విజయవాడ నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జైరమేశ్ ను బరిలో దించాలనే ఆలోచనలో ఉన్నారట జగన్. విజయవాడ నుంచి టీడీపీ తరుపున సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని బరిలోకి దిగనుండటంతో… నానిని ఢీకొట్టడానికి.. జైరమేశ్ అయితేనే కరెక్ట్ అనే ఆలోచనలో ఉన్నారట జగన్.

ఇక.. ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి గుంటూరు లేదా నరసరావుపేటలో ఏదో ఒక లోక్ సభ స్థానం నుంచి బరిలో దించనున్నారట. మోదుగులకు గుంటూరు ఫిక్స్ అయితే.. నరసరావుపేట నుంచి లోక్ సభ ఇన్ చార్జిగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలును నరసరావుపేట అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మాజీ పోలీస్ కు ఈసారి చాన్స్..

మీకు గుర్తుందా? టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికే సవాలు విసిరి ఫేమస్ అయిన మాజీ ఎస్ఐ గోరంట్ల మాధవ్ కు టికెట్ ఇవ్వడానికి జగన్ సిద్ధంగా ఉన్నారట. ఆయనకు అనంతపురంలోని హిందూపురం స్థానాన్ని కేటాయించినట్టు తెలుస్తోంది. మరోవైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు టికెట్ ఇవ్వనున్నారట. విజయనగరం లోక్ సభ స్థానం బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీకి కేటాయించనున్నారు.

మొత్తంగా లిస్ట్ చూసుకుంటే… శ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్, విజయనగరం- బొత్స ఝాన్సీ, విశాఖ- ఎంవీవీ చౌదరి, అనకాపల్లి- వరద కల్యాణీ, అరకు- గొట్టేటి మాధవి, కాకినాడ- బలిజ అశోక్, రాజమండ్రి- మార్గాని భరత్, అమలాపురం- చింతా అనురాధ, నరసాపురం- రఘురామ కృష్ణంరాజు, ఏలూరు- కోటగిరి శ్రీధర్, విజయవాడ- దాసరిజైరమేశ్, మచిలీపట్నం- బాలశౌరీ, గుంటూరు లేదా నరసరావుపేట- మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నరసరావుపేట లేదా గుంటూరు- శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు- మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాజంపేట- మిథున్ రెడ్డి, కడప- అవినాష్ రెడ్డి, హిందూపురం- గోరంట్ల మాధవ్, అనంతపురం- పీడీ రంగయ్య, నంద్యాల- శిల్పా రవిచంద్ర, మిగిలిన స్థానాలపై మంచి అభ్యర్థి కోసం జగన్ అన్వేషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version