సాధారణంగా బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ఉండే టీవీల్లో ప్రభుత్వ యాడ్స్, లేదా ప్రయాణికులకు సంబంధించిన సమాచారాన్ని ప్రసారం చేస్తారు. కానీ ఓ రైల్వే స్టేషన్లో మాత్రం ఏకంగా నీలి చిత్రాలు(పోర్న్ మూవీస్) ప్రసారం చేశారు. గమనించిన ప్రయాణికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. మళ్లీ అలాంటి వీడియోలే ప్రసారమవ్వడం స్థానికంగా కలకలం రేపింది. ఇంతకీ ఎక్కడి జరిగిందంటే..?
బిహార్ రాష్ట్రంలోని భాగల్‌పుర్ పట్టణ రైల్వేస్టేషనులోని టీవీ తెరపై సోమవారం రాత్రి 10.00 గంటల ప్రాంతంలో ఉన్నపళంగా ప్రత్యక్షమైన అసభ్య సందేశం చూసి ప్రయాణికులు అవాక్కయ్యారు. 5 నుంచి 10 నిమిషాలు ప్రసారమైన ఆ సమాచారాన్ని కొంతమంది తమ సెల్‌ఫోన్లతో చిత్రించగా, మరికొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రసారాలను వెంటనే నిలిపివేశారు.
గత మార్చి నెలలో బిహార్ రాజధాని పట్నా రైల్వేస్టేషనులోని టీవీ తెరలపై మూడు నిమిషాలపాటు ఏకంగా పోర్న్ మూవీ ప్రసారమైంది. ఈ ఉదంతం మరవకముందే భాగల్‌పుర్‌లో మరో అపశ్రుతి దొర్లింది. వివరాలు సేకరించిన సబ్ డివిజనల్ అధికారి ధనంజయ్‌కుమార్, డీఎస్పీ అజయ్‌కుమార్ చౌధరి టీవీ ప్రసారాలపై దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని తెలిపారు.