తెలంగాణలో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమోరిన్ ప్రాంతం మరఠ్వాడ, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక అంతటా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వివరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ సంచాలకులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవొచ్చని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ/నైరుతి గాలులు వీస్తున్నాయని వివరించింది.