మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తృణమూల్ కాంగ్రెస్ లో కొంత కాలంగా పని చేస్తున్న ఆయన తిరిగి సొంత గూటికి చేరారు. బుధవారం కోల్ కతాలో ఏఐసీసీ ఇన్ చార్జీ గులాం అహ్మద్ మీర్, ఇతర రాష్ట్రాల నాయకుల సమక్షంలో అభిజిత్ అధికారికంగా పార్టీలో తిరిగి చేరారు. 2021లో కాంగ్రెస్ నుంచి టీఎంసీలో చేరారు. తిరిగి రావడాన్ని సొంతింటికి వస్తున్నట్టుగా అభివర్ణించారు.
రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో చేరడంపై మీడియా ప్రశ్నించగా.. “కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో పట్టింపు లేదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను టీఎంసీలో చేరాను. మేము ఇప్పుడు ఇచ్చే ఆదేశాలను, బాధ్యతలను ముందుకు తీసుకెళ్తాం” అని పేర్కొన్నారు. 2012లో ఉప ఎన్నికలో, 2014 ఎన్నికల్లో లోక్ సభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి ఖలీలూర్ రెహమాన్ చేతిలో ఓడిపోయారు అభిజిత్.