కొందరు అనేక కారణాల కారణంగా లేటు వయస్సులో పెళ్లి చేసుకుంటారు. మరికొందరికి త్వరగానే పెళ్లయినా పిల్లలు కలగరు. ఇలా అనేక కారణాలో 40 ఏళ్ల వరకూ గర్భం రాకపోతే ఆ తర్వాత పిల్లల కోసం ప్రయత్నించవచ్చా.. 40ఏళ్లు దాటితే గర్భందాల్చడంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.. తెలుసుకుందాం..
40 ఏళ్ల వయసులోనూ గర్భం దాల్చొచ్చు కానీ.. ముందుగానే డాక్టర్ని సంప్రదించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదట హార్మోన్ల సమతూకం ఉందేమో తెలుసుకోవాలి. ఆ సమయంలోనే వైద్యులు అండాల నాణ్యతనూ అంచనా వేస్తారు. ఏ మేరకు అండాలు విడుదల అవుతున్నాయనే దాన్ని బట్టి నిర్ణయం ఆధారపడి ఉంటుంది.
40 ఏళ్ల తర్వాత పిల్లలను కంటే.. ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు కాస్త తక్కువనే చెప్పాలి. బిడ్డలో అవకరాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే గర్భం దాల్చడాని కన్నా ముందే ఫోలిక్ యాసిడ్ మాత్రల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 40 ఏళ్ల తర్వాత అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువనే విషయం కూడా మరవకూడదు.
ఆహారపరంగా మార్పులు చేసుకుంటూ, అవసరం అనుకుంటే హార్మోన్లను తీసుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. గర్భం దాల్చాక జన్యుపరమైన సమస్యలు లేకుండా ఉండేందుకు టిఫా, ఫీటల్ ఎకో వంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
నలభై దాటాక.. అధికరక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు రావొచ్చు. పుట్టబోయే బిడ్డకు మాయ నుంచి రక్తసరఫరా అందడం సమస్య కావొచ్చు. సహజ కాన్సు కన్నా సిజేరియన్ అయ్యే అవకాశాలే ఎక్కువ. అనుక్షణం వైద్యుల పర్యవేక్షణ అవసరం అన్న విషయాన్ని మరచిపోకూడదు.