పంటకు పట్టిన చీడపీడలను నివారించడానికి పురుగమందులు పిచికారీ చేయక తప్పదు. కానీ సరైన జాగ్రత్తలు పాటించకుంటే.. అది పిచికారీ చేసే వ్యక్తికే ప్రమాదం. ఏటా ఏంతో మంది రైతులు పంటకు పురుగుల మందు కొడుతూ.. అస్వస్థకు గురై కిందపడిపోవడం, కొందరికి ఆ ఘాటూ శ్వాసనాళ్లాలోకి వెళ్లి చనిపోవడం కూడా జరుగుతుంది. అసలు పిచికారీ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు చూద్దాం..!
పురుగుమందు పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పురుగు మందు పిచికారి చేసే సమయంలో రక్షణగా దుస్తులు, చేతికి గ్లౌజులు, ముక్కుకి, కళ్ళకు, రక్షణగా కవచాలు కచ్చితంగా ధరించాలి. స్ప్రే చేసే టైంలో మందు రైతు బాడీలోకి వెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి.. వీటిని తప్పక వేసుకోవాలి. వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి. పిచికారీ చేసిన వెంటనే సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ధరించిన దుస్తులను, కవచాలను విడిగా ఉతికి ఆరబెట్టుకోవాలి.
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి వేగంగా విస్తున్నప్పుడు, మంచు కలిగిన వాతావరణం ఉన్నప్పుడు, వర్షం కురిసే ముందు ఎలాంటి మందులు పంటలపై కొట్టకూడదు. వాతావరణ పరిస్థితులను గమనించి మందు పిచికారి చేసిన తర్వాత కనీసం నాలుగు గంటల వరకు వర్షం కురవదు అని నిర్ధారణకు వస్తేనే పిచికారీ చేయాలి.
మందులు పిచికారి చేసే సమయంలో నీరు త్రాగడం, ఏవైనా ఆహారాలు తినడం, గుట్కాలు నమలడం, పాన్ పరాకులు నమలడం, పొగ త్రాగడం, చేతి వేళ్లతో కళ్ళను నలపడం లాంటివి అసలు చేయరాదు.
మందులు పిచికారి చేసిన పొలములో గాని పొలం చుట్టూ ఉన్న గట్ల పైగాని పశువులను మేపటం చేయకూడదు. అలాగే గట్ల పై ఉన్న గడ్డిని పశువులకు మేతగా 6 నుండి 8 రోజుల వరకు వేయకూడదు.
ఆహార పంటలైన..కూరగాయలపై, పశుగ్రాస పంటలపై మందులు పిచికారి చేసినప్పుడు 8 నుండి10 రోజుల వరకు వేచి ఉండి తర్వాత పంటలు కోయడం గాని కూరగాయలు కోయడం గాని, పశుగ్రాసం కోయటం గాని చేయాలి.
పురుగుమందు వాడేసిన కాళీ డబ్బాలను పొలములో చిందరవందరగా వదిలేయకుండా గుంత తీసి పూడ్చి వేయాలి ప్లాస్టిక్ డబ్బాలను కాల్చివేయాలి.
మందు ద్రావణం తయారు చేయడానికి శుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి స్పేయర్ లోని ఫిల్టర్లను, నాజీలను, పైపులను తరచుగా శుభ్రపరుచుకోవాలి. నాజిల్ లో చెత్త చేరినప్పుడు నోటితో ఊదడం చేయకూడదు.
మందు ద్రావణం తయారు చేసేటప్పుడు 200 మిల్లీలీటర్ల నీటి సామర్థ్యం కలిగిన కొలత డబ్బాను ఎంచుకొని మందు ద్రావణం తయారు చేసుకోవాలి. మందు ద్రావణం తయారు చేసేటప్పుడు సిఫార్సు చేసిన మోతాదును మాత్రమే తయారు చేసుకోవాలి. ఎక్కువ తయారుచేసుకుని వాడితే మందులు పనిచేయవు.
ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల పంటతో. పాటు మనల్ని మనం కూడా రక్షించుకోవచ్చు.
-Triveni Buskarowthu