ముందుగా కొంచెం బియ్యాన్ని తీసుకొని అన్నం వండుకోవాలి. అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటే బెటర్. అన్నం ఉడికాక.. ఒక గిన్నెలో అన్నాన్ని తీసి విడివిడిగా చేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి.
పిల్లలు అన్నం తినమని మారాం చేసినా… ఎప్పుడూ అన్నం తిని బోరు కొట్టినా.. మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్ వండుకోవచ్చు. మరి.. మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసా?
బియ్యం, మంచినీళ్లు, చిన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, పచ్చి బఠానీలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సాజీరా, దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, వెల్లుల్లి, జీడిపప్పు, కిస్మిస్, పసుపు, కారం, ఉప్పు, నూనె ఉంటే చాలు.. వేడి వేడిగా మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్ ను ఏంచక్కా వండేయొచ్చు.
తయారు చేయు విధానం
ముందుగా కొంచెం బియ్యాన్ని తీసుకొని అన్నం వండుకోవాలి. అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటే బెటర్. అన్నం ఉడికాక.. ఒక గిన్నెలో అన్నాన్ని తీసి విడివిడిగా చేసి దాంట్లో కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. నెయ్యి వేస్తే అన్నం పొడిపొడిగా ఉంటుందన్నమాట. చేతికి కూడా అంటుకోదు.
దాల్చిన చెక్క, వెల్లుల్లి, లవంగాలను తీసుకొని రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకోండి. ఆ మిశ్రమాన్ని మూత పెట్టి పక్కన పెట్టండి. మరో గిన్నె తీసుకొని దాంట్లో ముందే తరిగి పెట్టుకున్న ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణీలు, బీన్స్ వేసి కొన్ని నీళ్లు పోసి కాసేపు వాటిని మరగబెట్టండి. నీళ్లు తక్కువగా పోస్తే అవి ఉడికాక నీళ్లు వాటిలోనే కలిసిపోతాయి. ఎక్కువ నీళ్లు పోస్తే మాత్రం అవి ఉడికాక మిగిలిన నీళ్లను పారబోయండి. మరో గిన్నె తీసుకొని కొంచెం నూనె పోసి.. దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించండి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.
పాన్ ను తీసుకొని స్టవ్ మీద పెట్టి.. దాంట్లో కొంచెం నూనె వేయండి. నూనె కాగిన తర్వాత సాజీరా వేసి వేయించండి. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. అవి బ్రౌన్ కలర్ వచ్చేదాక వేయించండి. దాంట్లో ముందే రెడీ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క మిశ్రమాన్న వేయండి. తర్వాత కొంచెం పసుపు, కారం, ఉడికించిన వెజిటబుల్ ముక్కలు వేసి బాగా కలపండి. బాగా గరిటెతో ఆ మిశ్రమాన్ని కలపండి. తర్వాత కొంచెం ఉప్పు వేయండి. కాసేపు దాన్ని ఉడికించండి. కొంచెం ఉడికాక.. అందులో అన్నాన్ని వేసి కలపండి. కాసేపు అన్నాన్ని వేడి చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. దాన్ని తీసి ఓ ప్లేట్ లో వేసి… దోరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ తో గార్నిష్ చేయండి. అంతే.. వేడి వేడి మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని పన్నీర్ కర్నీ కానీ లేదా.. రైతాతో కాని తింటే ఆ రుచే వేరు. పిల్లలు కూడా దీన్ని లొట్టలేసుకుంటూ తింటారు.