వ్యవసాయ రంగానికి సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల మూడు కొత్త బిల్లులను తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిని పార్లమెంటులో వాటిని ఆమోదింపజేసుకుంది. తాజాగా ఈ బిల్లులకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఇవి చట్టాలుగా మారాయి. ఈ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, బీహార్ వంటి రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. రైతులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు కూడా చేపట్టారు.
ఈ బిల్లులు రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొన్ని విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ కొత్త బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ రైతు సంఘాలు నిన్న ‘భారత్ బంద్’ కూడా చేశాయి. ఎలా అయితేనేమి ఎట్టకేలకు రాష్ట్రపతి వీటికి రాజముద్ర వేయడంతో ఇక ఇవి చట్టాలు గా మారిపోయినట్టే.