భారత ప్రధాని నరేంద్ర మోడీ శ్రీ సత్యాసాయి జిల్లా పుట్టపుర్తి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కాసేపట్లో పెనుకొండ నియోజకవర్గంలో పాలసముద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ(నాసిన్)ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. గన్నవరం నుంచి కడపకు సీఎం జగన్ బయలు దేరారు. ఈ పర్యటనలో లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించనున్నారు.
ఇక ప్రధాని గవర్నర్, ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకొని పుట్టపర్తి విమానశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పోలీస్ యంత్రాంగం చేపట్టారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మాదక ద్రవ్యాల అకాడమీ కి సూక్ష్మ రూపమే నాసిన్. ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో దీనిని ఏర్పాటు చేశారు. దాదాపు రూ.541 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రానికి ఎన్నో విశిష్టతలున్నాయి. గోరంట్ల మండలం పరిధిలోని పాల సముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకొని 503 ఎకరాల విస్తీర్ణంలో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు.