తిరుపతి తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులు భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేసింది.
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
మరోవైపు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబర్ 7 సాయంత్రం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంఘగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరగనుంది. ఆలయంలో యాత్రికుల వల్ల గాని, సిబ్బంది వల్ల గాని తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.