కరోనా విజృంభణ… దోపిడీ మొదలెట్టిన ప్రైవేటు ఆస్పత్రులు

-

దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతుంది. ఇటు తెలంగాణలోనూ రోజు వారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం చేసిన పరీక్షల్లో కొత్తగా 2,478 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ఓ వైపు రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో… కరోనా బాధితులను లక్ష్యంగా చేసుకున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీ మొదలెట్టినట్లు తెలుస్తోంది. కరోనా చికిత్సకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం అందింది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు కూడా వచ్చాయి.

ఇక కూకట్‌పల్లి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కరోనా వైద్యానికి రూ.6 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. కాగా హైదరాబాద్ నగరంలో గాంధీ, టిమ్స్, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో మాత్రమే ప్రభుత్వం కరోనా వైద్యం అందిస్తోంది. అయితే గాంధీలో కేవలం ఎమర్జెన్సీ కేసులను మాత్రమే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఇక ఇతర ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలన్నీ నిండిపోయాయి. ఈ నేపథ్యంలో కరోనాను సొమ్ము చేసుకోవాలని చూస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు బాధితుల వద్ద లక్షల్లో వసూలు చేస్తున్నాయి.

ఇక అటు కోవిడ్ టీకాకు కూడా గిరాకీ పెరిగింది. కొన్ని ఆస్పత్రులు ఒక్కో డోసుకు రూ.3 వేలకు పైన వసూలు చేస్తున్నట్లు తెల్సింది. దీనికి సంబంధించిన వ్యవహారం రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల దృష్టికి చేరగా… దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా చికిత్స, వాక్సిన్‌కు అధిక ధర వసూలు చేయడంపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా చాలా మందిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్న పరీక్షలు చేయించుకోవడానికి ముందుకురావడం లేదు. సొంతంగా మెడిసిన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version