తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. ఉదయం సుప్రభాత సేవలో వీరంతా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం PSLV-C59 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఇప్పటికే కౌంట్ డౌన్ కొనసాగుతోంది. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని సైంటిస్టులు అంతా శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు సమాచారం.
శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్‌వీ-సీ59 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు సైంటిస్టులు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు.యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలను పీఎస్ఎల్‌వీ-సీ59 తీసుకెళ్లనుంది.సూర్యుడి పై ప్రోబా-3 ఉపగ్రహం పరిశోధనలు చేయనుంది. కృత్రిమ సూర్య గ్రహణాలను సృష్టించి కరోనాను శోధించడం ఈ ఉపగ్రహం ప్రత్యేకత. దీని జీవిత కాలం రెండేళ్లు. కాగా, ఈ ప్రయోగానికి రూ.1,800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.