ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోషయ్య వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళ్లు అర్పించారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన ఫోటోతో కూడిన ప్రత్యేక పోస్టు పెట్టారు. రోషయ్యను అజాత శత్రువు, అపర చాణక్యుడు అని రేవంత్ రెడ్డి కొనియడారు. స్వతంత్ర సమరయోధుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అని రాసుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన రోషయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక పదవుల్లో పని చేశారు. ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోషయ్య, వరసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా కూడా ఆయన పనిచేశారు.వైఎస్సార్ మరణం అనంతరం ఏడాది పాటు సీఎంగా కొనసాగిన ఆయన.. తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు.