పబ్‌జి కార్పొరేషన్ ఇటీవలే భారత్‌లోని గేమింగ్ ప్రియులకు పబ్‌జికి సంబంధించిన అన్ని సర్వర్లకు యాక్సెస్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. మొదట్లో గేమ్ ను బ్యాన్ చేసినప్పటికీ ఐఎస్‌పీ పరంగా బ్యాన్ విధించలేదు. దీంతో గేమ్ బ్యాన్ అయ్యేటప్పటికే దాన్ని డివైస్‌లలో ఇన్‌స్టాల్ చేసుకున్న వారు గేమ్‌ను ఆడుతూ వచ్చారు. ఇక ఇటీవలే గేమ్‌కు చెందిన పూర్తి సేవలను నిలిపివేశారు. అయితే త్వరలోనే గేమ్‌ను మళ్లీ లాంచ్ చేస్తామని తాజాగా పబ్‌జి కార్పొరేషన్ ప్రకటించింది.
పబ్‌జి మొబైల్ గేమ్‌ను ఆ సంస్థ ఇండియన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపింది. పబ్‌జి మొబైల్ ఇండియా పేరిట గేమ్ త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. భారత గేమర్లకు తగినట్టుగా గేమ్‌లోని కంటెంట్ ఉండబోతుందని గేమ్ డెవలపర్లు వెల్లడించారు. అలాగే గేమ్‌లో నూతన తరహా క్యారెక్టర్లు ఉంటాయని తెలిపారు.
ఇక కొత్త గేమ్‌లో ఇంతకు ముందు కన్నా కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నారు. గేమ్ ప్లే పరిమిత గంటల సమయం దాటితే ఆగిపోతుంది. గేమర్ల ఆరోగ్యం దృష్ట్యా ఈ మార్పులు చేస్తున్నారు. అలాగే భారత్‌లో పబ్‌జి కార్ప్‌కు చెందిన మరో సంస్థను ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్థానిక అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అలాగే 100 మిలియన్ డాలర్లను భారత్‌లో పెట్టుబడి పెట్టనున్నట్లు పబ్‌జి కార్పొరేషన్ వెల్లడించింది. అయితే గేమ్‌ను త్వరలో లాంచ్ చేస్తున్నామని ఆ కంపెనీ చెప్పింది కానీ.. నిర్దిష్టమైన తేదీని చెప్పలేదు. అందువల్ల అతి త్వరలోనే గేమ్ మళ్లీ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.