విదేశాల్లో ఏమోగానీ మన దేశంలో మాత్రం ఇప్పుడు పబ్‌జి మొబైల్ గేమ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ గేమ్ విడుదలై ఏడాది మాత్రమే అవుతున్నా.. మన దేశంలో కొన్ని కోట్ల మంది దీన్ని ఆడుతున్నారు. వారిలో ఎక్కువగా పిల్లలు, కాలేజీలు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, యువత ఉండడం విశేషం. కాగా పబ్‌జి మొబైల్ గేమ్ ఆడడం వల్ల వస్తున్న దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ గేమ్‌ను దేశంలో వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది. అందులో భాగంగానే తాజాగా గోవా ఐటీ శాఖ మంత్రి రోహన్ ఖౌంటే కూడా ఈ గేమ్‌ను బ్యాన్ చేయాలని అన్నారు.
పబ్‌జి మొబైల్ గేమ్ ప్రతి ఇంట్లోనూ ఒక భూతంలా మారిందని, విద్యార్థులు చదువులను నిర్లక్ష్యం చేస్తూ.. పబ్‌జి మొబైల్ గేమ్ ఆడడంలో నిమగ్నమవుతున్నారని, కనుక గోవాలో ఈ గేమ్‌ను బ్యాన్ చేయాలని మంత్రి రోహన్ అన్నారు. అయితే గేమ్‌ను పూర్తిగా బ్యాన్ చేయకున్నా.. దాన్ని ఆడడంపై నియంత్రణ విధించాలని అన్నారు. గోవాలో ఈ గేమ్ ను పాఠశాలల్లో ఆడడాన్ని నిషేధించాలని, ఈ మేరకు సీఎం పారికర్‌కు విషయాన్ని తెలియజేస్తానని ఆయన తెలిపారు.
అయితే పబ్‌జి మొబైల్ గేమ్ డెవలపర్ అయిన టెన్సెంట్ గేమ్స్ మాత్రం గేమ్ నిషేధంపై వస్తున్న వార్తలపై ఇంకా స్పందించలేదు. గేమ్ ఆడడం వల్ల అనేక నెగిటివ్ ప్రభావాలు పిల్లలు, యువతపై పడుతున్నాయని ఇది వరకే చాలా మంది టెన్సెంట్ గేమ్స్‌కు లేఖలు రాశారు. అయితే ఆ సంస్థ సదరు ఫిర్యాదులపై స్పందించాల్సి ఉంది. ఏది ఏమైనా.. యువత సంగతేమో కానీ, పిల్లలను మాత్రం ఈ గేమ్ ఆడకుండా నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది..!