Ration Punjab : అధికారంలోకి వచ్చాక సామాన్యుడి పాలన ఎలా ఉంటుందో చేతల ద్వారా చూపిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పిన మాటలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు స్పష్టమైన చర్యలు తీసుకుంటుండడంపై సీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపక్షాలు సైతం మద్దతిస్తుండడం విశేషం. ఇప్పటికే ఆయన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థమైందా ? అవును ఆయనే పంజాబ్ సీఎం భగవంత్ మాన్. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ రేషన్ షాపుల ముందు ప్రజలు బారులు తీరి నిలబడుతున్నారు.. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది.. ఇంటి వద్దకే సరుకులు చేరుతున్నాయని తెలిపారు. కానీ. పేదలు, రోజు వారి వేతనం కోసం పని చేసే వారు రేషన్ షాపుల మందు పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. రేషన్ కోసం ఆ రోజంతా తమ పనిని వదులకోవాల్సిన దుస్థితి నెలకొందని, దీనిని దూరం చేయాలని తమ ప్రభుత్వం భావించిందని తెలిపారు. అనేక మంది వృద్ధులు రేషన్ కోసం రెండు, మూడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లడం తనకు తెలుసన్నారు. ఇకపై ఎవరూ క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు.. దీని కోసం సెలవు పెట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఇలాంటి కష్టాలు ఇకపై ఉండకుండా.. నాణ్యమైన రేషన్ ను ఇంటి వద్దకే సరఫరా చేయనున్నామని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు ఈ పథకం ఆప్షనల్ మాత్రమేనని, ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఈ మేరకు ఆయన 2022, మార్చి 28వ తేదీ సోమవారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అధికారులే లబ్దిదారులకు ఫోన్ చేసి మీకు అనువైన సమయంలో వచ్చి సరుకులు అందచేయడం జరుగుతుందని, ఎవరికైనా రేషన్ డిపో దగ్గరిలోనే ఉంటే… వారు వెళ్లి తెచ్చుకోవచ్చన్నారు. సీఎం భగవంత్ మాన్ తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. పంజాబ్ సీఎం ప్రకటన ఎంతో గొప్పదని, ఇది పేద ప్రజలకు మేలు చేస్తుందన్నారు. ఢిల్లీలో ఈ పథకం అమలు చేయాలని ప్రయత్నిస్తే.. కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. పంజాబ్ లో ఈ పథకం అమలైతే ఇతర రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తాయన్నారు.