తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పుట్టమధు అరెస్టు ఇప్పుడు కొంత మలుపు తిరిగింది. ఈ రోజు ఉదయం ఆయనను పోలీసులు విడుదల చేసి ఇంటికి పంపించారు. లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా మూడు రోజులు కస్టడీలో ఆయనను విచారించిన రామగుండం పోలీసులు పూచీకత్తుపై ఆయనను విడుదల చేశారు.
ఎప్పుడు పిలిచినా రావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆయన ఉదయమే పెద్దపల్లిలోని తన ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఏదైనా ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇస్తారా లేక మౌనంగా ఉంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే ఆయనను ఈటల రాజేందర్‌లాగే పదవి నుంచి తొలగించేందుకు పార్టీ అధిష్టానం రెడీ అవుతోందని తెలుస్తోంది. నిన్న గంగుల కమలాకర్ చెప్పిన మాటలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. త్వరలోనే పార్టీ పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెబుతున్నారు. అయితే విచారణ తర్వాత చర్యలుంటాయా లేక ఈ లోపే వేటు పడుతుందా అనేది తెలియాలి. ఇక పుట్ట కూడా టీఆర్ ఎస్ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదని సమచారం. మరి ఆయన కూడా ఈటల లాగా పదవి నుంచి తీసేసేదాకా చూస్తారా లేక ముందే రాజీనామా చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.