రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని బీసీ జాతీయ సంక్షేమం సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత తొమ్మిది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి, మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సేవ చేసి.. ఆయన గెలుపుకు కృషి చేసిన వట్టి జానయ్య యాదవ్ పై అక్రమ కేసులను పెట్టడంపై ఆర్. కృష్ణయ్య మండిపడ్డారు. బీసీలు ఓట్లు వేసే యంత్రాలు కాదని… నాయకులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మంత్రి జగదీశ్వర్ రెడ్డికి అండగా ఉండి.. ఆయన గెలుపుకు కృషి చేసిన డీసీఎంఎస్ కో-ఆపరేటివ్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ఎన్నికల్లో నిలబడతానంటే కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు.
జానయ్యపై ఒకే రోజు 70 కేసులు నమోదు చేయడం ఏంటి అని ప్రశ్నించారు.వెంటనే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకొని జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. త్వరలోనే సూర్యాపేటలో లక్ష మంది బీసీలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. అంతే కాకుండా జగదీశ్వర్ రెడ్డి ని వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసులు ఎత్తివేయకపోతే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బీసీలు తగిన బుద్ధి చెప్తారని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.