తనపై భూకబ్జా ఆరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 160 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్ లో ప్రభుత్వ, ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములు ఉన్నాయని రఘునందన్ చేసిన ఆరోపణలు సరికాదన్నారు.
ఆధారాలు లేకుండా తనపై అభాండాలు వేయవద్దన్నారు. సాక్ష్యాధారాలు ఉంటే చూపించాలన్నారు. రఘునందన్ పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడారని, ఆర్డీఎస్ కాల్వ, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు.
తమ కుటుంబానికి భూములు ఉన్నచోట ఆర్డీఎస్ భూములే లేవన్నారు. అంతేకాదు, రఘునందన్ రావు ముందుకొస్తే, భూములు దగ్గరుండి సర్వే చేయిస్తానని అన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన సవాల్ కు సిద్ధమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. నిరంజన్ రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని..ఎప్పుడు పిలిచానా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
తన ఆరోపణలకు స్పందించి ఆహ్వానించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నిరంజన్ రెడ్డి కేవలం వనపర్తికి మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.