రఘునందర్ రావు రాజకీయ ప్రస్థానం..!

దుబ్బాక ఉపఎన్నికల్లో మాధవనేని రఘునందన్‌రావు ఘన విజయం సాధించి అన్ని వర్గాలను ఆకర్షించారు. తన వృత్తి జీవితాన్ని ఒక విలేకరిగా మొదలు పెట్టి తాజాగా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పత్రికా విలేకరిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా అంచెలు అంచెలుగా ఎదిగారు. సోలిపేట రామలింగారెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని ఆయన మరణం తర్వాత మరోసారి ఒక జర్నలిస్టుగా పనిచేసిన రఘునందన్‌రావు గెలుచుకోవడం విశేషం.

Raghunandan
Raghunandan

దుబ్బాక మండలం బొప్పాపూర్‌కు చెందిన భగవంతరావు, భారతమ్మ దంపతులకు రఘునందన్‌రావు 1968 మార్చి 23న సిద్దిపేటలో జన్మించారు. డిగ్రీ (బీఎస్సీ) వరకు చదివి ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు. పటన్ చెరుకులో స్థిరపడి ఐదేళ్ల పాటు ఒక తెలుగు దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. అటు తర్వాత హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. ఈ క్రమంలో రాజకీయాలపై ఆసక్తి పెరిగి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ సమయంలో అందులో చేరారు. కానీ, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై 2013లో టీఆర్‌ఎస్‌ ఆయనను సస్పెండ్‌ చేసింది. అప్పుడు బీజేపీలో చేరి 2014, 2018, అసెంబ్లీ ఎన్నికలల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దుబ్బాక, మెదక్‌ స్థానాల నుంచి పోటీ చేశారు. మూడు సార్లు ఓడిపోయినా.. పట్టు వదల్లేదు. సోలిపేట ఉప ఎన్నికల్లో ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఊహించని రీతిలో గెలుపొందారు.

తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తానని ఉప ఎన్నికల్లో విజయం సాధించిన బీజేబీ అభ్యర్ధి మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. రాష్ట్రంలోని ఆరాచక పాలనకు దుబ్బాక ప్రజలిచ్చిన తీర్పు ప్రగతి భవన్ వరకు వినిపించాలని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో గెలుపొందినట్లు రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన గెలుపునకు కృషి చేసిన రాష్ట్ర నాయకులు, కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారంలో సహకారించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు, బూత్ స్థాయి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.