అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. కొత్త అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించేందుకు నిరాకరిస్తున్నాడట. ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆరోపణలు చేస్తూ.. జో బైడెన్ కు పగ్గాలు రాకుండా అడ్డుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా అటార్నీ జనరల్ విలియం బార్ ఓటింగ్ అక్రమాలపై విచారణకు న్యాయశాఖకు అనుమతి ఇవ్వడం, అధికార మార్పిడికి ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం బైడెన్ బృందానికి సహకరించకపోవడం దీనికి నిదర్శనం.
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే పెంటగన్ అధ్యక్షుడిని తొలగించారు. కరోనా కట్టడి కోసం బైడెన్ ఏర్పాటు చేయదలచుకున్న నిపుణుల బృందానికి ప్రభుత్వ వివిధ విభాగాల అధికారులు సహకరించలేదు. ట్రంప్ వారి చేత నో చెప్పించారు. ఈ మేరకు ఎన్నికల్లో ఓటమిని అంగీకరించాలని పలువురు రిపబ్లికన్ సెనేటర్లు, మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ తదితరులు ట్రంప్ కు సర్ది చెప్పినా మాట వినడం లేదు.
అయితే ఈ విషయంలో రిపబ్లికన్ పార్టీ ప్రముఖులు కొందరు ట్రంప్ వైపే మొగ్గు చూపుతున్నారు. ట్రంప్ చేస్తుందే కరెక్ట్ అన్నట్లు తన వైపు నిలబడ్డారు. అయితే పార్టీలో తనకు మద్దతుగా నిలవని వారి పదవుల నుంచి తప్పించేందుకు ట్రంప్ సకల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఈ మేరకు పెంటగన్ చీఫ్, రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ ను పదవి నుంచి తొలగించారు. ఈయనతో పాటు ఎఫ్ బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్, సీఐఏ అధ్యక్షుడు గినా హాస్పల్, సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథొనీ ఫాసీలను తమ తమ పదవుల నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన మద్దతుదారులను సంఘటితంగా ఉంచేందుకు ట్రంప్ ఎన్నికల తరహా ర్యాలీలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ట్రంప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. కుటుంబసభ్యులను ముందుంచి.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ప్రచారం చేయాలన్నది ట్రంప్ ప్లాన్. ఆ దిశగా సక్సెస్ సాధిస్తారా..? లేదా ఓటమిని ఒప్పుకుంటారా..? అనేది వేచి చూడాల్సిందే.