అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో రైతులను దగా చేసే ప్రయత్నం జరుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. సీఆర్డీఏ ద్వారా రైతులకు వచ్చిన అధికారాలని కాల రాసేందుకు ప్రభుత్వమే కుట్ర పన్నుతోందని విమర్శించారు. ప్రభుత్వం చేసిన కొత్త చట్ట సవరణ ద్వారా రైతులకు దక్కేది గుండుసున్నా అని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు అనేది కేవలం కంటితుడుపు వివరణ అని చెప్పారు. కొత్త రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో కూడా స్పష్టంగా ఉందన్నారు. ఒకే రాజధానిలో రాజభవన్, హైకోర్టు, అసెంబ్లీ వంటి భవనాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని స్పష్టంగా ఉందన్నారు. ఆ మేరకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని రఘురామకృష్ణరాజు చెప్పారు.
రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు ఆందోళనకు గురికావద్దని రఘురామకృష్ణరాజు అన్నారు. ఎమ్మెల్యేలు అందరూ వారి వారి నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితి తెలుసుకుని ముఖ్యమంత్రికి వివరిస్తే ఆయన మనసు కరుగుతుందని నమ్ముతున్నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నాలుగు జోన్లు ఏర్పాటు చేస్తామన్న మేరకు ముందుకు వెళితే అభివృద్ధి సాధ్యం కానీ.. మూడు రాజధానులు వల్ల సాధ్యం కాదన్నారు. 151 స్థానాలు గెలుచుకున్న మీరు రాజీనామా చేసి ప్రజల వద్దకు రిఫరెండం కోసం వెళ్తే 175 కు 175 మీరే గెలుచుకోవచ్చన్న రఘు… ఇది ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి నేను ఇచ్చే సూచనే తప్ప.. పార్టీకి, పార్టీ అధ్యక్షుడికి కాదని వ్యాఖ్యానించారు.