విద్యా దీవెన పథకంలో భాగంగా నగదును సకాలంలో తల్లుల ఖాతాలో జమ చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. నూతన విద్యా సంవత్సరం గత ఏడాది సెప్టెంబర్ మాసంలో ప్రారంభమైనప్పటికీ, ఇప్పటి వరకు వారికి తొలి క్వార్టర్ డబ్బును అకౌంట్లో జమ చేయలేదని, ఇక రెండవ మూడవ సంవత్సరం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఇప్పటికే మూడు, నాలుగు క్వార్టర్ల సొమ్ము బకాయి పడ్డారని తెలిపారు.
ప్రభుత్వ అనాలోచిత ఆలోచనల వల్ల ఫీజులు చెల్లించనిదే, విద్యార్థులను కాలేజీ యాజమాన్యాలు పరీక్షలను రాయించడం లేదని, విద్యా దీవెన పథకంలో భాగంగా తల్లుల ఖాతాలో నగదు జమ చేసి జగనన్ననే ఈ సొమ్ము ఇస్తున్నాడని భ్రమింపజేయాలని చూశారని అన్నారు. ప్రజాధనంతో ఓట్ల కొనుగోలు చేయవచ్చుననే దురాలోచనతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం సకాలంలో విద్యా దీవెన పథకం కింద సొమ్ములు చెల్లించకపోవడం వల్ల, విద్యార్థులే అష్ట కష్టాలు పడి తమ ఫీజులు తామే చెల్లించుకుంటున్నారని తెలిపారు.
తల్లుల ఖాతాలో కాకుండా, నేరుగా కాలేజీలకే ఫీజులు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇచ్చి విద్యార్థులను ఆదుకోవాలని రఘురామకృష్ణ రాజు గారు డిమాండ్ చేశారు. తల్లుల మనసు దోచుకోవాలని విద్యా దీవెన పథకం పేరిట విద్యా వంచన చేస్తున్నారని ధ్వజమెత్తారు.