వైసీపీ తరుపున ఎంపీగా గెలిచి…అదే పార్టీకి పెద్ద తలనొప్పి మారిన నాయకుడు రఘురామకృష్ణం రాజు. ప్రతిరోజూ ఈయన భోజనం అయిన చేస్తారో లేదో తెలియదు గానీ, జగన్‌పై విమర్శలు చేయకుండా మాత్రం ఉండలేరు. పైగా ఢిల్లీలోనే ఉంటూ ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి మరీ..జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు. ఇలా తమపై విమర్శలు చేస్తున్న రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ నేతలు కూడా చూస్తున్నారు గానీ, పెద్దగా వర్కౌట్ కావడం లేదు.
ఇక ఇదే సర్వేలో నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు ఓడిపోవడం ఖాయమని తేలింది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రఘురామ ఓడిపోతారని ఆత్మసాక్షి గ్రూప్ తేల్చి చెప్పింది. ఇక ఆ సర్వేకు కౌంటర్‌గా, రఘురామ తన సొంత సర్వేని బయటపెట్టారు. ఈ సర్వేలో నరసాపురంలో జగన్ నిలబడ్డా…తానే గెలుస్తానని చెప్పారు. జగన్ కంటే తనకే ఎక్కువ ఓట్లు వస్తాయని సర్వేలో చూపించారు.
అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 50 సీట్లు దాటి రావని అన్నారు. అయితే రఘురామ సర్వే ఎప్పుడు చేయించారు? ఆ సర్వేని ఇప్పుడు ఎందుకు బయటపెట్టారు? ఈ సర్వేలో నిజమెంత? అంటే చెప్పడం కష్టమే. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రఘురామ, సర్వేలో కూడా వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని చెప్పారు. అంటే ఈ సర్వేని నమ్మడం కష్టమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతునారు.