ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గి అద్భుతమైన విజయాన్ని ఖాతాలో వేసుకున్న భారత క్రికెట్ జట్టు గురించి అన్ని వైపుల నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. నాలుగు టెస్టుల సిరీస్ లో గెలిచిన భారత్ మర్చిపోలేని అనుభూతులని తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ కోహ్లీ లేకపోయినా భారత యువ ఆటగాళ్ళు చూపిన సత్తా అందరికీ బాగా నచ్చింది. ఈ నేపథ్యంలో టెస్ట్ సిరీస్ కి కెప్టెన్ గా వ్యవహరించిన అజింక్య రహానేపై ప్రశంసలు వస్తున్నాయి. టెస్ట్ క్రికెట్ కి రహానేని కెప్టెన్ గా ఉంచాలన్న డిమాండ్ పెరుగుతుంది.
మాజీ ఆటగాడు బిషన్ సింగ్ బేడీ కూడా రహానేని టెస్ట్ క్రికెట్ కి కెప్టెన్ ని చేయాలని, వన్డే, టీ ట్వంటీలకి కోహ్లీ, రోహిత్ లలో ఎవరినైనా ఉంచాలని అంటున్నాడు. ఐతే అలా చెబుతూనే సెలెక్టర్లు ఈ విధంగా ఉంచడానికి ధైర్యం చేయలేరని తెలిపాడు. దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న మాటలని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ తన నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది. ఆస్ట్రేలియా కారణంగా మరోమారు కెప్టెన్సీ గురించి చర్చకి వచ్చింది.