రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ భువనగిరి టికెట్ ను కేటాయించిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కోసం అమిత్ షా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షామాట్లాడుతూ.. కాంగ్రెస్ కు కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని, భువనగిరిలో రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసిన చెంచా అయిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని అన్నారు.
కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా, శోచనీయంగా మారిందని హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని, మోడీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్ధం చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి పదికి పైగా సీట్లు గెలిపిస్తే.. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాహుల్ బాబా హామీ ఇచ్చి సూర్యాస్తమయంలోపు మరిచిపోతారని షా విమర్శించారు.రైతులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా రూ.5 లక్షల లోన్ ఇస్తామన్నారని, ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామన్నారని, కాంగ్రెస్ హామీలను ఇస్తామంటుంది కానీ.. ఎన్నటికీ నెరవేర్చదని ఫైర్ అయ్యారు.