ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు, పోలవరం నిర్వాసిత రైతులు కలిశారు. స్థానిక రైతులతో కలిసి నినాదాలు చేస్తూ రాహుల్ బస చేసిన శిబిరానికి చేరుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేలా చూడాలని రాహుల్‌కు వినతిపత్రం సమర్పించారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌కి అమరావతే ఏకైక రాజధాని కావాలి. అమరావతి రైతుల పోరాటానికి నేను సంఘీభావం తెలుపుతున్నా. రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తాం’’ అని రాహుల్ తెలిపారు. రాహుల్ గాంధీ కర్నూలు జిల్లా హాలహర్వి నుంచి ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నం సమయానికి ఆలూరు సరిహద్దుకు చేరుకున్నారు. మధ్యాహ్నం యాత్ర తిరిగి ప్రారంభమై ఆలూరు హులేబీడు, మనేకుర్తి మీదుగా ఆదోని మండలం శాగి గ్రామం వరకు కొనసాగనుంది. రాత్రి రాహుల్ అక్కడే బస చేస్తారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.