కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా మార్చి 31వ తేదీ వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాల్స్, బార్లు తదితర ప్రదేశాలను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటోంది. ఇక మరోవైపు రైళ్లలో ఇప్పటికే ఏసీ బోగీల్లో ప్రయాణికులకు దుప్పట్లను ఇవ్వడం నిలిపివేశారు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో మరోవైపు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన 250 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ ధరను 5 రెట్లు పెంచారు. ఈ క్రమంలో ప్రస్తుతం రూ.10 ఉన్న ప్లాట్‌ఫాం టిక్కెట్ ధర ఇకపై రూ.50 కానుంది. ఇక పెంచిన ధరను బుధవారం నుంచి అమలు చేయనున్నారు. ప్లాట్‌ఫాంపై జనాల రద్దీని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ తెలిపింది.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ప్లాట్‌ఫాం టిక్కెట్ ధరను భారీగా పెంచామని రైల్వే శాఖ తెలిపింది. దీని వల్ల జనాలు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్‌లో ఉండేందుకు ఇష్టపడరని, దీంతో కరోనా వైరస్ వ్యాప్తికి కొంత వరకు అడ్డుకట్ట వేసినట్లవుతుందని అధికారులు తెలిపారు.