హైదరాబాద్ లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మొన్న కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ రోజు కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అయితే తాజాగా మళ్లీ హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సరూర్ నగర్, అంబర్ పేట, దిల్ సుఖ్ నగర్ మెహదీపట్నం, నల్లకుంట, వనస్థలిపురం, గోల్కొండ, అబిడ్స్, బి.యన్ రెడ్డి నగర్ ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది.
ఇదిలా ఉంటే మరో రెండు గంటల్లో భారీ వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తివేయడం తో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో మూసారాంబాగ్ వంతెన పైనుండి నీరు వెళుతోంది. ఇక కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ తో పాటు విద్యుత్ అంతరాయం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.