తెలంగాణ మీదుగా మరో ఉపరితల ఆవర్తనం.. కొనసాగుతోంది. సముద్రమట్టానికి 4.5 – 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఆవర్తనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు కొనసాగుతాయి. అల్పపీడనం ఏర్పడిన తర్వాత మూడు రోజులపాటు కొనసాగి ఆ తర్వాత పశ్చిమ దిశగా కదులుతుందని అంటున్నారు అధికారులు. తీర ప్రాంతంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు జగిత్యాల, కరీంనగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది.
ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్క అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి,మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించింది.