ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 వేలం పాటలో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం విదితమే. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వేలంలో రాయల్స్‌తోపాటు ముంబై, ఆర్‌సీబీలు అతని కోసం పోటీ పడ్డాయి. తరువాత ఆర్‌సీబీ తప్పుకుంది. దీంతో ముంబై, రాయల్స్ అతని కోసం పోటీ పడగా చివరకు రాయల్స్ అతన్ని అంతటి భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేసింది.
అయితే మోరిస్‌కు అంతటి ధరను ఎందుకు పెట్టారో రాయల్స్‌కు చెందిన క్రికెట్ డైరెక్టర్, మాజీ ప్లేయర్ కుమార సంగక్కర తెలిపాడు. మోరిస్ చక్కని ఆల్ రౌండర్ అని, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్ లు ఆడకపోయినా, ఐపీఎల్‌లో అతని ప్రదర్శన బాగుందని, అతను ఇన్నింగ్స్ చివర్లో తన బ్యాట్ తో లేదా బాల్‌తో జట్టును గెలిపించే సత్తా ఉన్నవాడని, అందుకనే అతన్ని కొనుగోలు చేశామని సంగక్కర తెలిపాడు.
ఇక ఇండియన్ ఆల్ రౌండర్ శివం దూబేను కూడా రాయల్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ.4.4 కోట్లను అతనికి వెచ్చించింది. దీనిపై కూడా సంగక్కర స్పందించాడు. జట్టులో మిడిల్ ఆర్డర్ స్పాట్ కోసం ప్లేయర్ కావాలనుకున్నామని, శివం దూబే అయితే ఆ స్థానానికి న్యాయం చేస్తాడని నమ్మకం ఉందని, అందుకనే అతన్ని కొన్నామని సంగక్కర తెలిపాడు.