గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పై వైసీపీ కొత్త స్కెచ్

-

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. బరిలో దిగే అభ్యర్దుల పై మాత్రం ఇంకా క్లారిటికి రాలేకపోతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ఈసారి ఉపాధ్యాయ సంఘాల నుండి సాదాసీదా టీచర్లే బరిలో దిగుతారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి వైసీపీ వ్యూహం పై గోదావరి జిల్లాల్లో ఇప్పుడు చర్చ నడుస్తుంది.

ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23వ తేదీలోపు నామినేషన్లు వేయాలి. 26వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. పోటీ ఉంటే మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనా.. ఇంకా ఎవరూ ముందుకు రాకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఎస్టీయూ, పీఆర్‌టీయూ, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ నుంచి ఎవరిని పోటీకి దించాలనే విషయంలో ఇంకా ఏకాభిప్రాయం కదరలేదు. ఈ విషయంలో సంఘాల నేతల మధ్య తర్జనభర్జన సాగుతోంది. ఇప్పటికే టీచర్ల యూనియన్లు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఒక వర్గానికి పీఆర్‌టీయూ నాయకత్వంలో అభ్యర్థిని ప్రకటించారు. వీరికి ఎస్టీయూ మద్దతిస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ బలాన్ని చాటుకుంటున్న యూటీఎఫ్‌ నాయకత్వం.. రెండు రోజుల్లో తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

ఇన్నాళ్లూ మధ్యేమార్గంగా ఉంటూ తమకు సహకరించే సంఘాలకు మద్దతిస్తున్న ఏపీటీఎఫ్‌ కూడా ఈసారి బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది. ఇలా సంఘాల మధ్య అనైక్యతతో ఈసారి.. రాజకీయ అనుభవం లేనివారే బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ కలుపుకుని పోటీకి దిగే వారు.. ఎవరూ ముందుకు రావడంలేదు. ప్రస్తుత ఎమ్మెల్సీ రాము సూర్యారావు పదవీకాలం ఈనెలాఖరుతో ముగియనుంది. మరోసారి రాము సూర్యారావును పోటీ నిలపాలని అనుకున్నా.. అందుకు ఆయన సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అధికార వైసీపీ.. ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీపై తర్జనభర్జన పడుతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నామమాత్రంగా కనిపిస్తుండటంతో..అభ్యర్థిని నిలిపి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆలోచన చేస్తోంది వైసీపీ. శాసనమండలిలో బలం పెంచుకోవడం వైసీపీకి చాలా అవసరం. అక్కడ టీడీపీని నిలువరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది అధికార పార్టీ. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని మార్గాల్ని పరిశీలిస్తోంది. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో మరోసారి పోటీకి మాజీ ఎమ్మెల్సీ చైతన్య రాజు కుటుంబం ఉత్సాహం చూపుతోంది. ఇప్పటికే చైతన్యరాజు.. వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు
తెలుస్తోంది.

2009 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చైతన్య రాజు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఆయన కుమారుడు రవికిరణ్ విజయం సాధించారు. వీరిద్దరిలో ఒకరు ప్రస్తుత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. 2015లో జరిగిన ఎన్నికల్లో చైతన్య రాజు ఓడిపోయారు. ఆ సానుభూతి కూడా పనిచేని.. అధికార పార్టీ మద్దతిస్తే.. మరోసారి ఎమ్మెల్సీగా గెలవడం ఖాయమని చైతన్యరాజు భావిస్తున్నారు. ఇది వైసీపీకి కూడా ఉపయోగపడేలా ఉండటంతో ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version