ఈ నెల 23 నుంచి డిసెంబర్ 1 వరకు ఓటర్ స్లిప్‌ల పంపిణి జరుగుతుందని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం వ్యాప్తంగా గల 32,796 పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న రూ.90.72 కోట్లు సీజ్ చేసినట్లు వివరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు చాలా వరకు తగ‍్గాయన్నారు.
రాష్ట్రంలో 7,45,838 మంది కొత్త ఓటర్లు, 243 మంది ప్రవాసులు ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత నిర్వహిస్తామన్నారు. ఇందుకుగాను కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల నుంచి అదనంగా 18,000 పోలీసులను తెచ్చుకున్నట్లు తెలిపారు.