వైసీపీ, జ‌న‌సేన తెలంగాణ‌లో ఎందుకు పోటీ చేయ‌డం లేదు?

-

ఇది రాజ‌కీయ లాలూచీ కాదా? నెల్లూరులో సీఎం చంద్ర‌బాబునాయుడు

నెల్లూరు: తెలంగాణలో వైసీపీ, జనసేన ఎందుకు పోటీచేయడం లేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. లాలూచీ రాజకీయాలకు ఇది నిదర్శనం కాదా? అని ఆయన అన్నారు. మంగళవారం నెల్లూరులో స్థానిక ఎస్వీజీఎస్ కాలేజ్ గ్రౌండ్‌లో టీడీపీ ధర్మపోరాట దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశం కోసం కాంగ్రెస్‌తో ఉన్న 40 ఏళ్ల బేధాభిప్రాయాలు పక్కనబెట్టానని చెప్పారు. మోదీ మాటలకు, చేతలకు పొంతన ఉండదని విమర్శించారు. దేశంలో అవినీతిని బీజేపీ పెంచి పోషిస్తోందని బాబు ఆరోపించారు. సీబీఐని గుజరాత్ మనిషి ఆస్థానా బ్రష్టుపట్టించారని, దోవల్‌ కూడా ఈ ఎపిసోడ్‌లో ఉన్నారంటే దేశ పరిస్థితి ఏమవుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. అధికారం దుర్వినియోగం అవుతుందనే.. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి నిరాకరించామని ఆయన స్పష్టం చేశారు.

పెద్ద నోట్ల రద్దు పెద్ద ఫార్స్‌గా మారిందన్నారు. రూపాయి విలువ పడిపోయిందని, పెట్రో ధరలు పెరిగిపోయాయని, వ్యాపారులు, రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. మోదీ మాటల ప్రధాని మాత్రమేనని, ఆయన వల్ల ప్రజలకు ఎలాంటి లాభం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలను ప్రధాని మోదీ బెదిరించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. కుట్రలో భాగంలోనే టీడీపీ నేతలపై ఐటీ పేరుతో దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఎంత అణిచివేస్తే అంతగా ఎగిసిపడతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశమంతా తిరుగుతున్నామని, బీజేపీపై యుద్ధం ప్రకటించామని, ఈ దేశాన్ని కాపాడుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. హామీలు అడిగితే తనకు మెచ్యురిటీ లేదని, కేసీఆర్‌కు ఉందని మోదీ అన్నారని బాబు విమర్శించారు. కేసీఆర్‌ను తాను అన్ని విధాలా ప్రోత్సహించానని అన్నారు. వైసీపీ ఉచ్చులో పడింది బీజేపీనేనని..లాలూచీ రాజకీయాలు తాను చేయనని సీఎం స్పష్టం చేశారు. జగన్‌, కేసీఆర్‌తో కుట్ర పన్ని టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news