కేంద్రమంత్రి , ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్.. గుండెపోటుతో కన్నుమూశారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన పాశ్వాన్.. నలుగురు ప్రధానుల మంత్రివర్గాల్లో కీలక పదవులు చేపట్టారు. ఆయన చాలాకాలం నుంచీ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 74 ఏళ్ల పాశ్వాన్‌కు కొన్ని రోజుల క్రితం గుండె ఆపరేషన్ జరిగింది. కేంద్రంలో ఎక్కువ ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్న పాశ్వాన్ చాలా ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించారు.
పాశ్వాన్ 9సార్లు ఎంపీగా ఉన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో 1984, 2009లో మాత్రమే ఆయన ఓటమి చవిచూశారు. 1989 తర్వాత పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ రెండోసారి యూపీఏ సర్కారు ఏర్పాటు చేసినప్పుడు మినహా ఆయన ప్రతి ప్రధానమంత్రి మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పాశ్వాన్, కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ సర్కారులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కూడా మంత్రి పదవుల్లో ఉన్నారు.విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నుంచి నరేంద్ర మోదీ వరకూ ఆరుగురు ప్రధానమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన ఏకైక రాజకీయ నేత పాశ్వాన్ ఒక్కరే.
ఆయన ప్రతిసారీ మంత్రిగా తన స్థానాన్ని పదిలం చేసుకోవడంపై ఒకప్పుటి ఆయన సహచరుడు, తర్వాత రాజకీయ ప్రత్యర్థిగా మారిన లాలూ ప్రసాద్ యాదవ్ పాశ్వాన్‌పై చురకలు వేశారు. ఆయన, తన మొత్తం రాజకీయ జీవితంలో ఒక్కసారి మాత్రం రాజకీయ పవనాలను సరిగా అంచనా వేయలేకపోయారని భావిస్తారు. 2019 జూన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న పాశ్వాన్.. మోడీ కేబినెట్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా కొనసాగారు.